Thathva Rahasyaprabha    Chapters   

ఉద్దేశ్యము

మానవ జీవితంలో సంపాదించదగిన ధర్మార్థ కామ మోక్షము లను నాలుగు పురుషార్దములలో మోక్షమే నిత్యనిరతిశయ పురుషార్థమని అసేతు హిమాచలపర్యంత భూమండలమందలి ఆస్తిక మహాశయు లందరికిని తెలిసిన విషయమేగాని నూతనము కాదు ఇట్టిమోక్ష పురుషార్థము అద్వైత సిద్ధాన్తమందు అవిద్యా నివృత్యుపలక్షితమగు సత్య జ్ఞానానంద స్వరూపావస్థానమేకాని లోకాంతరప్రాప్తిమున్నగునవి కావు. అనగా మూలాజ్ఞానము పోయినతరువాత మిగులు ఆత్మస్వరూపమే మోక్షమని తాత్పర్యము. ఇట్టి మోక్షమునకు ఆత్మానుభూతియే సాధనముగాని ఇతరములు సాధనములు కావని శ్రుతిస్మృతీతిహాసములవలన అభిజ్ఞులకర్థమైన విషయమే.

ఇట్టి విజ్ఞానము దుర్మతప్రభావముచే ఖిలప్రాయమైన దశయందు అనగా ఈ ఘోరకలియందు రెండువేల సంవత్సరములకు పూర్వము దుర్మతములను ఖండించి పరమపురుషార్థోపయుక్తమగు అద్వైత సిద్ధాంతమును ఉద్ధరించుటకై సాక్షాజ్జగదీశ్వరుడు శ్రీ శంకరాచార్య రూపముగా నవతరించి ప్రస్థానత్రయ భాష్యములను వ్రాసి సామాన్య విజ్ఞానముగల వారికికూడా అద్వైతసిద్ధాంతమందు బాటగునటుల అనేక వేదాంత ప్రకరణములను ప్రాసియుండిరని చాలామంది విజ్ఞులకు విదితమైన విషయమే. నేను కూడా ఈ గ్రంథమందు వ్రాసియుంటిని కూడ. కలిప్రభావముచేత క్రమముగా ఈ ఆధ్యాత్మిక బ్రహ్మవిద్య సంప్రదాయముగా పఠన పాఠక్రమము లేకపోవుటచేత చాలాభాగము కృశించినది. సామాన్యులు భాషాంతరీకృత వేదాంతగ్రంథములను చూచిరి. ఆ విజ్ఞానముతోనే కొంతమందికి ప్రబోధించుటచేతకూడా సంప్రదాయ విరుద్ధమగు స్ఖాలిత్యము లేర్పడినవి. ప్రస్తుతకాలంలో ఈ లోపములు అనివార్యములు, అపరిహార్యములైయున్నవి. మరల ఈశ్వరానుగ్రహమువలన ఏనాటికైనను గురుశిష్య సంప్రదాయానుసారముగా పాఠప్రవచనపద్ధతి ప్రబలముగా ప్రచారములోకి వచ్చినప్పుడే ఈ విద్యలకు అభివృద్ధి కలుగునుగాని వేరుమార్గము లేదని పించుచున్నది. పాఠప్రవచనసంప్రదాయం తగ్గిపోవుటచేత అనేక ఆధ్యాత్మిక వేదాన్తగ్రంథములు ప్రచారంలో లేక మరుగుబడిపోయినవి. ఆగ్రంథములయందలి గంభీరవిషయములు లుప్తప్రాయము లయినవి. వేరే చెప్పనక్కరలేదు. అందుచేతనే అనేక గ్రంథములు తిరిగి ముద్రణలేకుండా పోయినవి. వినోదప్రధానమగు ఈ కలికాలంలో విజ్ఞాన ప్రధానమగు గ్రంథములు వెనుకపడుట ఆశ్చర్యముకాదని కూడా. అనిపించుచున్నది. మహానుభావులు వ్రాసిన గ్రంథములనే చదివేవారులేక నిరర్ధకప్రాయముగా నున్న ఈ కాలంలో నూతన గ్రంథరచన చేయు ప్రయత్నం నిజమైన దృష్టితో ఆలోచిస్తే విఫలమేకాని సఫలంకాదని భావించి ఉదాసీనుడనైయంటిని. ఈ స్థితిలో అనేకమంది పెద్దలవలనను, నా వలనను తత్వగ్రంథములను శ్రవణం చేసి అద్వైత వేదాస్తశాస్త్రమందలి సారమును పూర్వజన్మ సత్సంస్కారమువలన బాగుగా గ్రహించి అవకాశమున్నంతలో మనుష్యజన్మలో తత్వవిచారం చేయుట చాలా ముఖ్యమని నిశ్చయముగల చాలా ఉత్తములగు పారమార్ధికదృష్టి ప్రధానులగు ఆస్తికులు, న న్నీవిధముగా ప్రోత్సాహము చేసిరి.

శంకరాచార్యులవారు వ్రాసిన దక్షిణామూర్తిస్తోత్రము మొదలగు ప్రకరణ గ్రంథములున్నవి, వాటిని కొన్ని టీకాతాత్పర్యములున్నవి. గాని విద్వాంసులయినవారు విశదముగా వ్రాసిన బాగాయుండును గనుక మీరు తప్పక వ్రాయవలయునని గట్టిగా చెప్పిరి. దక్షిణామూ ర్తిస్తోత్రమునకు, అపరోక్షానుభూతికి, దశశ్లోకికిని, సోపాన పంచకమునకు మనీషా పంచకమునకును, ఏక శ్లోకికిని తాత్పర్య వివరణమును వ్రాయమనిరి. ఆప్తులైన ఆస్తికులగువారు మీరు వ్రాసిన చాలా ఉపకారముగా నుండునని నన్ను విశేషముగా ప్రోత్సాహం చేసినను, ఈ కాలంలో శ్రమపడి వ్రాసినను యెవరు చూస్తారని ఉపేక్షించితిని. ఉపేక్షించవద్దు తప్పక వ్రాయమని మరల ప్రోత్సహించుటచేత శంకర భగవత్పాదులవారు వ్రాసిన దక్షిణా మూర్తిస్తోత్రమునకు ప్రతి పదార్థమును వ్రాసి కొన్ని విశేషములతో ప్రతి శ్లోకమునకు వేరువేరుగా తాత్పర్య వివరణమునుకూడా వ్రాసితిని. అపరోక్షానుభూతికి ప్రతిపదార్థముకూడా తెలియనటుల ప్రతిశ్లోకమునకును తాత్పర్య వివరణమును మాత్రమే వ్రాసితిని. దశశ్లోకికి ప్రతిపదార్థమును వ్రాసి తాత్పర్యవివరణమునుకూడా వ్రాసితిని. సోపాన పంచకమునకుకూడా ప్రతిపదార్థమును వ్రాసి తాత్పర్యనిరూపణమును కూడా వ్రాసితిని. ఇక్కడికే పుస్తకం పెద్దదయ్యేటట్లు కనిపించినది. అందుచేత సాధ్యమైనంత వరకు తగ్గించి వ్రాసిన అందరును చదువుదురని విస్తారమును తగ్గించి మనీషాపంచకమునకు ముందు శంకరాచార్యచరిత్ర సంగ్రహముగావ్రాసి, మనీషా పంచకమునకు తాత్పర్య వివరణమును మాత్రమే వ్రాసితిని. ఏక శ్లోకికి ప్రతిపదార్థము ; తాత్పర్యవివరణముకూడా వ్రాసితిని.

కొన్నింటికిమాత్రమే సంస్కృతవ్యాఖ్యానము లభించినవి. వాటిని చూచియుంటిని. అట్టి వ్యాఖ్యానములు కొన్నింటికి లేవు ప్రయత్నంకూడా చేయలేదు. లభించినంత వరకు పూర్వవ్యాఖ్యానములను అనుసరించియే వ్రాసితిని. తాత్పర్యవివరణలో సిద్ధాన్తమునకు విరోధంలేకుండా కొన్ని విశేషములను వ్రాసితిని. శ్రీ శంకరాచార్యులవారి భాష చాలా ప్రసన్న గంభీరమైనది. ప్రసన్నముగా నున్నందువలన శ్ఞోకములు సులభముగా నున్నట్లు కనిపించును. అర్థము కూడ అగునుగాని, విషయం చాలా గంభీరముగా నుండును. గనుకనే తాత్పర్య వివరణమును వ్రాసితిని. సంస్కృత భాషయందు పరిచయం లేనివారికి, కొంత సామాన్యముగా పరిచయం కలవారికిని బాగుగా అద్వైతసిద్ధాన్త మర్థమగుటయే ప్రధానోద్దేశ్యంగా పెట్టుకొని వ్రాసితినిగాని వేరు కాదు. సర్వఙ్ఞులగు శంకర భగవత్పాదులవారు వ్రాసిన ప్రకరణములకు వారి తాత్పర్యమును వివరించు సామర్ధ్యం లేక పోయినను దైవమందే భారంవేసి దైవానుగ్రహం వలన స్పురించినవిషయములనే వ్రాసితిని. అందరికిని సులభముగా అర్థమగుటయే ప్రధానోద్దేశ్యంగా పెట్టుకొని కేవల గ్రాంధికభాషనుగాని, కేవల (నవనాగరిక) వ్యాహారిక భాషనుగాని ఉపయోగించకుండా కొంత గ్రాంధికముగాను, కొంత వ్యావహారికముగానుండునటుల నా సామర్థ్యము ననుసరించి (యథాశక్తి) యథామతిగా వ్రాసితిని.

గనుక విఙ్ఞులు భాషాలోపములను, అచ్చులు, హల్లులు మొదలగు అతక్షర స్ఖాలిత్యములను దోషములను పరిగణించక విషయమునే, గుణమునే ప్రధానముగ గమనింప గలరని విశ్వసించుచున్నారు. ఇది ఆధ్యాత్మిక వేదాన్తగ్రంథము గనుక ఒక మాటు చదివి గొడవగానున్నదని నిరుత్సాహపడక, నాలుగు మూడు మార్లు ఈ పుస్తకంలో వ్రాసిన శంకరాచార్య ప్రకరణములను, తాత్పర్యవివరణములను చదివినయడల అద్వైత సిద్ధాన్తం కరతలామలకముగా అర్థమై ఇక యే వేదాన్త గ్రంథములను విన్నను, చూచినను అతి సులభముగా తెలిసి కొనగలరని అట్టి విజ్ఞాన మీ గ్రంథము వలన కలుగునని చెప్పుటలో అతిశయోక్తికాదని, నిరహంకారముగా శంకరరచనా గాంభీర్యమునే దృష్టిలో పెట్టుకొని ఇట్లు వ్రాసితినని సహృదయులు గ్రహించగలరని విశ్వసించుచున్నాను. ఈకాలంలో కొందరికి ప్రబోధ చేయుట చాలా అవసరమని కూడా; ఆత్మీయుల ప్రోత్సాహము వలన నాకు విజ్ఞానప్రధానమగు, మోక్షోపయుక్తమగు ఈ గ్రంథమును ఆస్తికులందరు తీసికొని చదువవలయునని మిత్రభావముతో కోరుచున్నాను ముద్రణ అయిన తరువాతకూడా పరిశీలించి తప్పొప్పులపట్టిక వ్రాసియున్నాను. దీనిని బట్టి నిర్దుష్టముగా చూడవచ్చును ఈ తప్పొప్పుల పట్టిక చూచి గ్రంథమును సరిదిద్దుకొని ఈ గ్రంథమును అమూలాగ్రముగా కొన్ని పర్యాయములు చూచినయడల అద్వైతసిద్ధంతపరిజ్ఞానము సామాన్యులకు కూడా సుదృఢముగా కలుగుననే విషయము ఈ గ్రంథము నవలోకించువారు స్వయముగానే గ్రహించగలరని నా విశ్వసము ఈ దక్షిణామూర్తి స్తోత్రము మొదలగు అద్వైత వేదాంత ప్రకరణములకు తాత్పర్య వివరణ వ్రాయుచు ఆయా యర్థములను బలపరచుటకు శంకరాచార్యులవారు రచించిన మరికొన్ని శ్లోకములను ఇతర వచనములను కూడా ఉదహరించి వాటిపై తాత్పర్యమును కూడా వ్రాసితిని, మరియు భగవత్పదులవారు కొన్ని ప్రకరణములలో ఒక ప్రకరణమున చెప్పిన విషయములను ఇతర ప్రకరణముల యందుకూడా దయతో ప్రతిపాదించియుండిరి. గనుక ఆ ప్రకరణములకు తాత్పర్యము వ్రాయుచు సుబోధకొరకై విశేషముగా ఆయా ప్రకరణముల యందు అవసరానుసారము ప్రతిపాదించిన విషయమునే ప్రతిపాదించినట్లున్నను పునరుక్తిగా గ్రహింపకుందురని విశ్వసించుచున్నాను. గనుక అద్వైతాభిమాను లెల్లరు శ్రీ శంకరాచార్య ప్రకరణ తత్వరహస్యప్రభ యను ఈ ఆంధ్రతాత్పర్య వివరణమును గుణగ్రహణదృష్టితో చూడగలరని విశ్వసించుచున్నాను. ఈ తత్వరహస్య ప్రభయను తాత్పర్య వివరణమును వ్రాయమని నన్ను ప్రోత్సహించిన ఆస్తిక మహాశయులకు సర్వేశ్వరుడు సర్వదా ఆయురారోగ్యైశ్వర్యాది సకల సంపదలను ఆధ్యాత్మిక విద్యాసంపదను కూడా అనుగ్రహించుగాక యని కోరుచున్నాను. ప్రతిపదార్థ సహిత మయిన ఈ తాత్పర్య వివరణమునకు తత్వరహస్యప్రభయని పేరు పెడితిని.

విజయవాడ _ 2. ఇట్లు,

23_6_72 మద్దులపల్లి మాణిక్యశాస్త్రి

Thathva Rahasyaprabha    Chapters